సూర్యాపేట: నాలుగు మున్సిపాలటీలు గులాబీ ఖాతాలో చేరాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలను స్పష్టమైన మెజార్టీతో ఆ పార్టీ దక్కించుకుంది. అలాగే సూర్యాపేటలో జనరల్ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పీఠంలో ఎస్సీ మహిళను కూర్చోబెట్టి టీఆర్‌ఎస్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఎక్కడా ప్రకటించకుండా గోప్యత పాటించి సీల్డ్ కవర్లలో ఆపార్టీ నాలుగు మున్సిపాలిటీల ప్రిసైడింగ్ అధికారులకు అందజేసింది. మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరండంతో టీఆర్‌ఎస్ శ్రేణులు బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నాయి.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సూర్యాపేట మున్సిపాలిటీ ఏలిక ఎవరోనని ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటి నుంచి అంతా ఉత్కంఠతో ఎదురుచూశారు. జనరల్ మహిళకు రిజర్వు కావడం.. పలువురి పేర్లు చర్చకు రావడంతో పాటు వారు చైర్మన్ పీఠం దక్కించుకుంటారని జోరుగా చర్చలు సాగాయి. అయితే అందరి ఊహలకు అందకుండా చైర్మన్ ఎన్నిక కావడం గమనార్హం. 9వ వార్డు నుంచి విజయం సాధించిన పెరుమాళ్ల అన్నపూర్ణ పేరు సీల్డ్ కవర్‌లో పీఓకు అందింది. అమెను ప్రతిపాదించడం, బలపరచడం, సభ్యుల ఓట్ల మద్దతుతో.. చైర్మన్‌గా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్ వార్డు సభ్యులతో పాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే జనరల్ మహిళా స్థానంలో చైర్మన్‌గా అవకాశం కల్పించడంతో ఆమె కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. మున్సిపాలిటీలో కొత్త సంప్రదాయానికి ఇది దిక్సూచి అవుతుందని మంత్రి మీడియాతో మాట్లాడుతూ కళ్లు చమర్చారు. అన్నపూర్ణ 9 వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుందమల్ల శేఖర్‌పై 374 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే వైస్ చైర్మన్‌గా 22వ వార్డు నుంచి గెలిచిన పుట్టా కిశోర్ విజయం సాధించారు. 24 మంది వార్డు సభ్యులు, మంత్రి ఎక్స్ అఫీషియో ఓటు, ముగ్గురు ఇండిపెండెంట్ వార్డు సభ్యుల మద్దతుతో అన్నపూర్ణ చైర్మన్‌గా, కిశోర్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.