ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్ చేశారా?

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రముఖ  ఈ కామర్స్ సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ముఖ్యంగా బిగ్‌బాస్కెట్ , గ్రోఫర్స్ లాంటి ఆన్ లైన్  గ్రాసరీస్ (కిరణా) సేవల సంస్థలు కూడా తమ డెలివరీలను తాత్కాలికంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ఈ కోవలో ఉన్నాయి. దీంతో ఆన్ లైన్ కొనుగోళ్ల పై ఆధారపడిన వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.‘ప్రస్తుతానికి సేవలను నిలిపివేశాం..కేంద్ర అధికారుల స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, స్థానిక అధికారుల ఆంక్షల కారణంగా సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేవు. త్వరలోనే పునరుద్దిస్తాం’ అనే సందేశం దేశవ్యాప్తంగా చాలామంది బిగ్‌బాస్కెట్ వినియోగదారులకు దర్శనమిస్తోంది. అంతేకాదు ఆర్డర్ రద్దు చేశామని తెలియజేయడానికి చింతిస్తున్నామనే సందేశం  కూడా  కొంతమంది వినియోగదారులను వెక్కిరిస్తోంది. ప్రభుత్వం అత్యవసర సేవలుగా ప్రకటించినప్పటికీ డెలివరీలను తాత్కాలికంగా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని  బిగ్‌బాస్కెట్ వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది.