డబ్బులు ఇవ్వడం లేదు.. మోసపోకండి!

న్యూఢిల్లీ: కంటికి కనిపించని కరోనా వైరస్‌పై ప్రపంచం యావత్తు పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో కోవిడ్‌-19పై వస్తున్న నకిలీ వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారంపై మరో పోరాటం చేయాల్సి వస్తోంది. కష్టకాలంలోనూ కేటుగాళ్లు కల్తీ సమాచారంతో జనాన్ని గందోరగోళానికి గురిచేస్తున్నారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. 




తాజాగా ఇలాంటి నకిలీ మెసేజ్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రతి భారతీయుడికి ప్రధాని నరేంద్ర మోదీ రూ.15 వేలు ఇస్తున్నట్టు నకిలీ మెసేజ్‌ సృష్టించారు. అంతేకాదు డబ్బులు తీసుకోవాలంటే ఈ లింకుపై క్లిక్‌చేసి, అందులోని దరఖాస్తును నింపాలని సూచించారు. అయితే ఇది నకిలీ సమాచారం అని, ఈ లింక్‌పై క్లిక్‌ చేయొద్దని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) సూచించింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, మోసపోవద్దని పీఐబీ పేర్కొంది.